ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటినా రావాల్సిన బకాయిలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఏఆర్ ఎస్సై కె.మైసయ్య బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో ఎస్ఐగా పనిచేసి గత ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందిన మైసయ్యకు సుమారు రూ.50-60 లక్షల బకాయిలు రావాల్సి ఉంది.
పదవీ విరమణ అనంతరం రావాల్సిన బకాయిలు అందకపోవడం వల్ల మైసయ్య కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే, మైసయ్యతో పాటు ఆయన భార్య భాగ్యమ్మ కూడా అనారోగ్యానికి గురై ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
భార్య భాగ్యమ్మ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్కు తరలించారు. అయితే, మైసయ్య ఆరోగ్యం కూడా క్షీణించడంతో బుధవారం అర్ధరాత్రి ఆయన కన్నుమూశారు.
ఆసుపత్రి బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం అందడంతో, విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం చొరవ తీసుకుని కొంతమేర బిల్లులు చెల్లించి, మృతదేహాన్ని మైసయ్య నివాసానికి తరలించింది. ఈ సంఘటన ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.


