నిర్మల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రాచీన మోడీ లిపిలో రాసిన దస్తావేజులు వెలుగులోకి వచ్చాయని ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావ్ తెలిపారు. ఈ లిపి ప్రాచీనత, ప్రాముఖ్యతపై ఆయన వివరణ ఇచ్చారు.
డా. దేవరావ్ ప్రకారం, 13వ శతాబ్దంలో దేవగిరిని పాలించిన యాదవ రాజుల కాలంలో మంత్రి హేమాడ్ పంత్ దర్బారుల్లో రహస్య భాషగా మోడీ లిపిని అభివృద్ధి చేశారు. ఈ లిపిని తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో రాజుల ఆజ్ఞలు, శాసనాలు, భూమి పత్రాలు వంటి వాటి నమోదుకు ఉపయోగించేవారు.
తాను సుమారు 150 సంవత్సరాల నాటి మోడీ లిపిలో రాసిన ఒక ఫర్మానాను సేకరించినట్లు డా. దేవరావ్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో 1950 వరకు వ్యాపారస్తులు, కర్ణాలు తమ దస్తావేజులను ఈ లిపిలోనే రాసేవారని ఆయన తెలిపారు.
మరాఠి భాష, దేవనాగరి లిపి ఆధారంగా రూపుదిద్దుకున్న మోడీ లిపి, శివాజీ మహారాజ్ పాలనలో మరింత ప్రాచుర్యం పొందింది. శివాజీ మహారాజ్ వద్ద పనిచేసిన బాలాజీ అవచి చిట్నీస్ ఈ లిపిని సంస్కరించి, దర్బారు ఆదేశాలను వేగంగా చేరవేయడానికి వినియోగించారు.
“మోడణే” అనే పదం నుంచి “మోడీ” అనే పేరు వచ్చిందని, దీని అర్థం వంచడం లేదా మడవడం అని డా. దేవరావ్ వివరించారు. పెన్నును ఎత్తకుండా వేగంగా రాయగలిగే ఈ లిపిని గొలుసు రాతగా కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ లిపి కనుమరుగవుతోందని, లభిస్తున్న దస్తావేజులను సంరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.












