ముధోల్, 2026-08-14
ముధోల్ నియోజకవర్గంలో త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించాలని ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బోస్లె నారాయణ రావు పాటిల్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కోరారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బోస్లె నారాయణ రావు పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గంలో త్వరలో చేపట్టనున్న నామినేటెడ్ పదవుల భర్తీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ ఆయన ఒక వినతిపత్రాన్ని టీపీసీసీ అధ్యక్షుడికి అందజేశారు.
అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా పార్టీపై ఆయా వర్గాల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని బోస్లె నారాయణ రావు పాటిల్ వివరించారు.
అలాగే ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను టీపీసీసీ అధ్యక్షుడికి వివరించారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.












