మిర్యాలగూడ, జూన్ 30
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను విడుదల చేసి, నిలిచిపోయిన పథకాలను పునరుద్ధరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మిర్యాలగూడ లేబర్ కార్యాలయం ఎదుట మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, లేబర్ అధికారికి వినతిపత్రం అందజేశారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను తక్షణమే విడుదల చేసి, నిలిచిపోయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం మిర్యాలగూడ లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, లేబర్ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతమ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి రవినాయక్, పట్టణ కన్వీనర్ తిరుపతి, రామ్మూర్తి లు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికుల నుంచి సెస్ రూపంలో వేల కోట్ల రూపాయలు వసూలు చేసినప్పటికీ, కార్మికులకు అందాల్సిన వివాహ, ప్రసూతి, విద్య, ప్రమాద, సహజ మరణం తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న సంక్షేమ దరఖాస్తులను పరిష్కరించి బకాయిలను విడుదల చేయాలన్నారు. సహజ మరణ పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు రూ.6,000 పెన్షన్ అందించాలని, కొత్తగా నమోదవుతున్న కార్మికులకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును బలోపేతం చేసి, కార్మికుల హక్కులను పరిరక్షించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు, వల్లాల రవి, నాయకులు రాజు, పాషా, గోవర్ధన, ఎండి గౌస్, ఉబ్బపల్లి శ్రీను, కరుణాకర్, ఆంజనేయులు, బొంగారాల వెంకటయ్య, యూనియన్ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.












