నిర్మల్, జూన్ 29
ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర పునఃసమీక్ష) ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జరిగిన వీడియో సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర పునఃసమీక్ష) ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం ఎస్ఐఆర్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఇప్పటివరకు పూర్తయిన ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీ వివరాలను సమీక్షించారు.
బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫాంలను అందజేయాలని, ఫాంల పంపిణీ చేసే అధికారం కేవలం బూత్ స్థాయి అధికారులకు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని, ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై సందేహాలు నివృత్తి చేసేందుకు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎన్యుమరేషన్ దరఖాస్తుల నమోదు విధానాన్ని కేవలం బూత్ స్థాయి అధికారులు మాత్రమే నిర్వహించాలని, ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించేందుకు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫాంలను తిరిగి సేకరించే ప్రక్రియను కూడా సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులతో మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, అన్ని నిబంధనలు పాటిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.












