తెలంగాణ రాష్ట్ర ఐకేపీ వీవోఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న వీవోఏల నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రి సీతక్క వీవోఏలకు రూ. 26,000 వేతనం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ హామీ అమలు కావడం లేదని ఆయన ప్రశ్నించారు.
"కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడం అంటే ఎండలో కూర్చోబెట్టడం కాదు" అని వ్యాఖ్యానిస్తూ, ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. జూన్ నెలలోపు వీవోఏల డిమాండ్లు నెరవేర్చకపోతే, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
వీవోఏల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే జాదవ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.












