సోనాల (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 10
సోనాల మండలానికి ఇటీవల మంజూరైన నూతన ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణానికి అనువైన స్థలాలను అధికారులు శుక్రవారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రి స్థలాన్ని ఈ కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదించే అవకాశం ఉంది.
సోనాల మండలానికి ఇటీవల నూతన ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలు మంజూరైన నేపథ్యంలో వాటి నిర్మాణం కోసం అనువైన స్థలాల పరిశీలన చేపట్టారు. శుక్రవారం ఎమ్మార్వో మల్లేష్, ఎంపీడీవోతో పాటు సంబంధిత అధికారులు మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, సోనాల సర్పంచ్ బిందుజ సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజుల పోతన్న, బీజేపీ మండల అధ్యక్షుడు బోరె రవితో కలిసి స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రి స్థలంలో నూతన ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణానికి గ్రామ ప్రజలు, నాయకులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. దీంతో ఆ స్థలాన్ని జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేస్తూ ఎమ్మార్వో ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా భవిష్యత్తులో పోలీస్ స్టేషన్, విద్యాసంస్థలు వంటి ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించేందుకు సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించినట్లు వెల్లడించారు. త్వరలో ఆ భూమికి సంబంధించి అధికారులు సర్వే నిర్వహించనున్నారని, గ్రామ ప్రజలు పూర్తి సహకారం అందించి మండల అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజుల పోతన్న, బీజేపీ మండల అధ్యక్షుడు బోరె రవి, కాంగ్రెస్ నాయకుడు పోశెట్టి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు రమేష్, హరీష్, నాయకులు అభిలాష్, టీఆర్ఎస్ నాయకులు సదానందం, భీంరావు, హరి సింగ్, కన్నా తదితరులు పాల్గొన్నారు.











