నిర్మల్, జూన్ 29
జిల్లాలోని మహిళా సంఘాలను మరింత ప్రోత్సహించి, స్వయం ఉపాధి రంగంలో రాణించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన సమీక్షలో అర్హులైన మహిళలందరినీ స్వయం సంఘాల్లో చేర్పించి, స్త్రీ నిధి రుణాలు అందించాలని సూచించారు.
జిల్లాలోని మహిళా సంఘాలకు మరింత ప్రోత్సాహం అందించి, వారు స్వయం ఉపాధి రంగంలో రాణించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన మహిళలందరినీ స్వయం సంఘాల్లో చేర్పించి, స్త్రీ నిధి రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రుణాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని తెలిపారు.
ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్లను ఏర్పాటు చేసే విధంగా మహిళా సంఘాలకు మార్గదర్శకత్వం ఇవ్వాలని అన్నారు. జిల్లాలోని స్వయం సంఘాలు గత కొన్నేళ్లుగా రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల్లో మంచి ప్రగతి సాధిస్తున్నాయని కలెక్టర్ అభినందించారు.
రుణాల తిరిగి చెల్లింపుల్లో డిజిటల్ విధానాలను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. డిజిటల్ పద్ధతుల ద్వారా రుణ చెల్లింపులు మరింత సులభతరం అవుతాయని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఎల్డీఎం రామ్ గోపాల్, స్త్రీ నిధి ప్రాంతీయ మేనేజర్ అనంత కిషోర్, విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












