అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతున్నా, కొన్ని మారుమూల ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మాత్రం అధ్వానంగానే ఉంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో రహదారి పూర్తిగా ధ్వంసమై, పెద్ద పెద్ద గుంతలతో నిండిపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొలిప్యాక్ గ్రామ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించడం దుస్సాహసమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
గత కొంతకాలంగా రహదారి మరమ్మతుల కోసం సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు కూడా బస్సు సర్వీసులను క్రమం తప్పకుండా నడపలేకపోతున్నారని తెలిపారు.
మండలంలోని ఇతర గ్రామాలతో పోలిస్తే తమ గ్రామానికి వచ్చే రహదారి పరిస్థితి దయనీయంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.












