** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
ప్రజలను చైతన్యవంతులను చేసే లక్ష్యంతో భవిష్యత్ తరాల కళాకారులను తీర్చిదిద్దాలని 'ప్రజాశక్తి' డిప్యూటీ ఎడిటర్ వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. కర్నూలులోని ప్రజానాట్యమండలి 11వ రాష్ట్ర మహాసభలో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి విధానాలను, ప్రజా ఉద్యమాల ప్రాధాన్యతను వివరించారు.
ప్రజలను చైతన్యవంతులను చేసే లక్ష్యంతో భవిష్యత్ తరాల కళాకారులను తీర్చిదిద్దాలని 'ప్రజాశక్తి' డిప్యూటీ ఎడిటర్ వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. కర్నూలులోని సన్యాసిరావు, పెంచలయ్య నగర్లో మూడు రోజులపాటు జరిగిన ప్రజానాట్యమండలి 11వ రాష్ట్ర మహాసభలో ఆయన సోమవారం ముగింపు ఉపన్యాసం చేశారు.
ప్రజా గొంతుకలను అణచివేయడం ద్వారా ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం బిజెపి చేసిందని, అయితే మొట్టమొదటిసారి యువత ఒత్తిడితో కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని, భయపెట్టే వారే ఉద్యమానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాంభూపాల్ వివరించారు. ఎంతటి నియంతృత్వ ప్రభుత్వాలనైనా ప్రజా ఉద్యమాలు ఓడించగలవని జెన్ జీ ఉద్యమం నిరూపించిందని అన్నారు. ఢిల్లీ ఆందోళన, సంఘీభావ కార్యక్రమాల్లో కొత్త గొంతుకలు, కళారూపాలు ముందుకు వచ్చాయని, ప్రజల్లోని పోరాట భావాన్ని ఒక వేదికపైకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు.
ప్రజలను మభ్యపెట్టి, చీల్చి గద్దెనెక్కాలని చూసే కుట్రలు ఎల్లకాలం సాగవని, ప్రజలు ఈ కుట్రలను ఎంతో కాలం భరించరనే సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రించడం, ప్రతిపక్షాలను లోబర్చుకోవడం ద్వారా 12 ఏళ్లుగా బిజెపి పరిపాలిస్తూ వస్తోందని, అయితే ఈ ప్రయత్నాలు క్రమంగా బలహీన పడుతున్నాయని తెలిపారు. ఢిల్లీ ఉద్యమంపై పొరుగు రాష్ట్రాల్లో సంఘీభావ సభలు నిర్వహిస్తే, మన రాష్ట్రంలోని అధికార పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మౌనం వహించడం శోచనీయమని అన్నారు. ప్రజాతంత్ర ఆలోచనలతో ఉన్న శక్తులను కళల ద్వారా ఐక్యం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
మారుతున్న సామాజిక పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావానికి అనుగుణంగా ప్రతి కళాకారుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డివి.రాజు అన్నారు. మహాసభలో ఆయన సౌహార్ద్ర సందేశం ఇచ్చారు. మొబైల్ ఫోన్ ద్వారానే షూటింగ్, ఎడిటింగ్ వంటి నైపుణ్యాలను నేర్చుకుని, తమ ప్రతిభను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని, ప్రజానాట్యమండలి ప్రజల కోసం, సమాజ ప్రగతి కోసం పనిచేస్తున్న గొప్ప సాంస్కృతిక ఉద్యమ సంస్థ అని కొనియాడారు.
ప్రజల గొంతును ప్రతిధ్వనింపజేసేవాడే నిజమైన సుకవి అని అష్టావధాని, సంస్కృత–ఆంగ్ల పండితులు డాక్టర్ బోరెల్లి హర్ష అన్నారు. ప్రజల హృదయాలను కదిలించి వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తే నిజమైన కళాకారుడని పేర్కొన్నారు. కళాకారులు ప్రజల జీవితాలతో మమేకమై సమాజానికి ఉపయోగపడే సృజన చేయాలని సూచించారు. ప్రజా సమస్యలను, ఆశయాలను ప్రతిబింబించే కళా సృష్టే చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.












