నిర్మల్, జూలై 20
నిర్మల్‌కు చెందిన ప్రముఖ పద్యకవి, సంస్కృత భాషా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి. వెంకట్ హైదరాబాదులో జరిగిన స్వర్ణావధానంలో పృచ్ఛక సన్మానం అందుకున్నారు. అక్షరకౌముది సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
నిర్మల్‌కు చెందిన సంస్కృత భాషా ప్రచార సమితి ఆదిలాబాద్–నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పద్యకవి డాక్టర్ బి. వెంకట్ హైదరాబాదులో నిర్వహించిన స్వర్ణావధానంలో పృచ్ఛక సన్మానం అందుకున్నారు.
అక్షరకౌముది సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మల్కాజిగిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో రెండు రోజులపాటు అవధానకౌముది నల్లాన్ చక్రవర్తుల సాహితీ నిర్వహించిన స్వర్ణావధానం వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా ప్రముఖ పద్యకవి, వ్యాఖ్యాత, సంస్కృత ఉపన్యాసకుడు డాక్టర్ బి. వెంకట్‌కు గురు సహస్రావధాని డాక్టర్ కడిమిళ్ల వరప్రసాద్, అక్షరకౌముది వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తులసి వెంకటరమణాచార్యులు, అధ్యక్షురాలు తులసి విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీదేవి, దర్శనం మాసపత్రిక ప్రధాన సంపాదకులు మరుమాముల వెంకట రమణశర్మ, అవధాన విద్యా వికాస పరిషత్ అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయశర్మ చేతుల మీదుగా స్వర్ణావధాన పృచ్ఛక సన్మానం అందజేశారు.
స్వర్ణావధానంలో డాక్టర్ బి. వెంకట్ దత్తపది ప్రక్రియలో వరుణదేవుడు వర్షాలు కురిపించాలని, సకల జీవులకు శాంతి చేకూరాలని, అన్నదాతలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ "భక్తి, యుక్తి, శక్తి, ముక్తి" అనే పదాలతో పద్యాన్ని ఆవిష్కరించాలని ప్రశ్న సంధించారు. దీనికి అవధాని తేటగీతి ఛందస్సులో చక్కని పద్యంతో సమాధానం చెప్పారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి సినీ హాస్యనటుడు బాబుమోహన్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
స్వర్ణావధానంలో పృచ్ఛక సన్మానం అందుకున్న డాక్టర్ బి. వెంకట్‌ను పలువురు కవులు, సాహితీవేత్తలు, కళాకారులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.












