రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, బాసర ఆలయ పునర్నిర్మాణం, ముధోల్ లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణంతో సహా పలు కీలక అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి బాసర పర్యటనకు రానున్న నేపథ్యంలో, పుష్కరాల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కూడా పాల్గొని, పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
బాసర ఆలయ పునర్నిర్మాణానికి 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నట్లు, మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో పాటు, ముధోల్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో, అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా చర్చించారు.
గతంలో బాసర ఆలయ అభివృద్ధికి తగిన ప్రాధాన్యత లభించలేదని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరగడం సంతోషదాయకమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ పర్యటన బాసర అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలోనే ప్రసిద్ధి చెందిన జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పున నిర్మాణ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా ముధోల్ నియోజకవర్గ ప్రజలు, భక్తులు ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.












