రాజన్న సిరిసిల్ల, 29 July
దేశవ్యాప్తంగా కరువు పరిస్థితుల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పేద, బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించిన బియ్యాన్ని లబ్ధిదారులకు అందించేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. గతంలోనూ ఇలాగే మూడు నెలల రేషన్ పంపిణీ చేసింది.
పేద, బలహీన వర్గాలు ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. గతంలో అత్యధిక వర్షాలు, తీవ్ర వేసవి పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించిన రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
వేసవికాలంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసి, జూలై నుంచి నెలవారీ రేషన్ పంపిణీని ప్రారంభించారు. కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి మూడు నెలల రేషన్ ఇవ్వడం లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కొక్కరికి 18 కిలోల చొప్పున మూడు నెలల బియ్యం పంపిణీ చేయనున్నారు.
రేషన్ బియ్యం పంపిణీ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పౌరసరఫరాల శాఖ సన్నద్ధమైంది. రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీ ప్రారంభించారు. అయితే, మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ఒకేసారి రేషన్ బియ్యం అందించడం వల్ల పంపిణీ చేయడంలో శ్రమ అధికమవుతుందని, నిల్వ సామర్థ్యం లేని దుకాణాల్లో డీలర్లు బియ్యం కోటాను భద్రపరచడం కష్టంగా మారుతుందని చెబుతున్నారు. దీనికి తోడు తూకంలో తరుగు, నెట్వర్క్ సమస్యలు, ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడం, ఒక్కో లబ్ధిదారుడికి వేలిముద్రల సరిపోవడానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టడం వంటి సమస్యలను డీలర్లు ఎదుర్కొంటున్నారు.












