బాసరలోని మొదటి ఘాట్ వద్ద గోదావరి నదిలో స్నానం చేస్తున్న మహిళ అకస్మాత్తుగా లోతు నీటిలోకి జారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది. బాసర పోలీసులు, ఆలయ సిబ్బంది సకాలంలో స్పందించి ఆమెను సురక్షితంగా రక్షించారు.
నిజామాబాద్ జిల్లా చిన్నాపూర్ తాండ గ్రామానికి చెందిన అరుణాదేవి (32) బాసరలోని మొదటి ఘాట్ వద్ద గోదావరి నదిలో స్నానం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆమె అకస్మాత్తుగా లోతు నీటిలోకి జారి మునిగిపోతుండగా అక్కడి యాత్రికులు గమనించారు.
యాత్రికుల కేకలు విని వెంటనే అప్రమత్తమైన బాసర పోలీసులు, ఆలయ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితి విషమంగా మారుతున్న వేళ, వారు చీరలు, తాళ్లు విసిరి ఆమెను పట్టుకుని సమన్వయంతో బయటకు లాగారు.
పోలీసుల ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తితో అరుణాదేవి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో అక్కడి యాత్రికుల్లో కాసేపు ఆందోళన నెలకొన్నప్పటికీ, బాసర పోలీసుల వేగవంతమైన చర్యలతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని భక్తులు కొనియాడారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోదావరి ఘాట్ల వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడడం అభినందనీయమన్నారు. భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా, ఇన్స్పెక్టర్ కిరణ్ సహా బాసర పోలీసు సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.


