ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యవర్గ సమావేశం బోథ్ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
బోథ్ మండల కేంద్రంలోని శంకర్రావు భవన్లో జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు భారతల గోవర్ధన్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు.
కార్మికుల హక్కులను బలహీనపరిచేలా 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చారని, ఎనిమిది గంటల పని దినాన్ని పది నుంచి పన్నెండు గంటలకు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విలాస్ విమర్శించారు. దేశంలోని 55 కోట్ల మంది కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన నొక్కి చెప్పారు.
కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లు నెరవేరకపోతే, ఈ సంవత్సరం చివరి నాటికి జిల్లా, రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించి, అవసరమైతే మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, కార్యవర్గ సభ్యులు ఏ. చంద్రకళ, కీర్తి రమణ, కే. గంగయ్య, కే. గోదావరి, ఎస్.కే. ఉస్మాన్, జె. రుక్మిణి, ఆలం తదితరులు పాల్గొన్నారు.












