తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర బీజేపీ నాయకులు కేవలం రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణవత్ గోవింద్ నాయక్ ఆరోపించారు.
నిర్మల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు ఇబ్బందుల్లో ఉన్నా కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు.
తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారని గోవింద్ నాయక్ పేర్కొన్నారు.
బీజేపీ నాయకులు రాజకీయాలను పక్కనపెట్టి, కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ నాయకులు ఆత్రం రాజేశ్వర్, వసంత్ రావ్, వెడ్మ శేఖర్ పాల్గొన్నారు.












