రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు వంటి గిగ్ వర్కర్లకు ఊరటనిస్తూ, 'తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ -2026 బిల్లు'కు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేశారు. మే డే సందర్భంగా ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.
ఈ బిల్లు లక్ష్యం యాప్ ఆధారిత అగ్రిగేటర్ల వద్ద పనిచేస్తున్న కార్మికులకు పని భద్రత, ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలను అందించడం. చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావడానికి అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్ల సంఘాలతో కార్మికశాఖ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో కార్మికుల పనివేళలు, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, సంక్షేమ నిధి వంటి కీలక అంశాలపై చర్చించి తుది మార్గదర్శకాలు రూపొందిస్తారు. మరో 10-15 రోజుల్లో ఈ గైడ్‌లైన్స్‌పై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ చట్టం గిగ్ ఎకానమీలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని, కంపెనీల నిబంధనలకు ఇకపై నియంత్రణ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్మికుల నుంచి వసూలు చేసే సేవా రుసుములో కొంత భాగాన్ని వారి సంక్షేమ నిధికి మళ్లించడం ద్వారా కార్మికులకు లబ్ధి చేకూరనుంది.












