మిర్యాలగూడ సమీపంలోని తుంగపాడు వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా, అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు. మిగిలిపోయిన చిన్న మరమ్మతులు, ఇతర పనులను పూర్తి చేసి, లబ్ధిదారుల గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని తెలిపారు. రాష్ట్ర మంత్రుల హాజరు అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
తాగునీరు, విద్యుత్ కనెక్షన్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సంపులలో నీటిని నింపి నిరంతర సరఫరాకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. కాలనీలో అంతర్గత రోడ్లు, అప్రోచ్ రోడ్డు నిర్మాణం, చెత్త తొలగింపు, మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. ఎలక్ట్రికల్ వైరింగ్ పనులను వెంటనే పూర్తి చేసి, పూర్తయిన ఇళ్లకు తాళాలు భద్రపరచాలని సూచించారు.
తాగునీటి సరఫరా కోసం పబ్లిక్ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కాలనీ ప్రారంభోత్సవానికి అవసరమైన శిలాఫలకం, బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అవసరమైతే 24 గంటలు పనిచేసి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా అధికారుల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని కోరారు.








