జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగే వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
వేదికను పూలతో ఆకర్షణీయంగా అలంకరించాలని, పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులను ఆహ్వానించాలని తెలిపారు.
వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం తగిన సీటింగ్, తాగునీటి సౌకర్యం, సౌండ్ సిస్టమ్, షామియానా తదితర ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
వేడుకల రోజున ఉదయం నిర్ణీత సమయానికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.












