ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో పారదర్శకత లోపించిందని, హెల్త్ కార్డులు జారీ చేయకుండానే చందా వసూలు చేయడం అన్యాయమని ఎస్టియుటిఎస్ నిర్మల్ జిల్లా శాఖ ఆరోపించింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలు, ప్యాకేజీ రేట్లు, ఆసుపత్రులతో ఒప్పందాలు ఖరారు కాకముందే, పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదని, డిజిటల్ హెల్త్ కార్డులు కూడా జారీ చేయలేదని వారు తెలిపారు. అయినప్పటికీ, ఉద్యోగుల బేసిక్ పే నుండి 1.5 శాతం చందా రూపంలో మినహాయించడం అన్యాయమని పేర్కొన్నారు.
ఎస్టియుటిఎస్ నిర్మల్ జిల్లా శాఖ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం తక్షణమే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, చందా మినహాయింపును నిలిపివేయాలని, పూర్తి విధివిధానాలు ఖరారైన తర్వాతే చందా వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్య పథకంలో చేరడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగులకే అవకాశం కల్పించాలని, భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకరి నుంచే చందా వసూలు చేయాలని సూచించారు. మరోవైపు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.








