తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మే నెల వేతనాల నుంచి ఈహెచ్ఎస్ (Employee Health Scheme) చందా పేరుతో ఆర్థిక శాఖ ఏకపక్షంగా కోతలు విధించడాన్ని పీఆర్టీయూ తెలంగాణ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది.
హెల్త్ కార్డులకు సంబంధించిన విధివిధానాలు ప్రకటించకుండా, ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ప్రీమియం వసూలు చేయడం, పథకంపై పూర్తి సమాచారం ఇవ్వకుండానే జీతాల్లో కోత విధించడం సరికాదని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి పేర్కొన్నారు. ఈహెచ్ఎస్ చందా 1.5% మినహాయింపుపై జీవో కూడా విడుదల చేయకుండానే ఆర్థిక శాఖ ఈ కోతలు విధించడం ఉద్యోగులను ఇబ్బందికి గురిచేస్తోందన్నారు.
కార్డులు ఇవ్వకుండానే వేతనాల నుంచి డబ్బులు కత్తిరించడంపై ఉద్యోగులు ఆర్థిక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని వేతనాల్లో కోతలను నిలిపివేయాలని కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను పునఃపరిశీలించాలని ఆయన కోరారు. ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, పారదర్శకంగా పథకాలను అమలు చేయాలని సూచించారు.











