బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీర యోధుడు మర్సుకోల రాంజీ గోండ్ 166వ వర్ధంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుందెబ్బ' మరియు జేఏసీ నిర్మల్ జిల్లా కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ సందర్భంగా నాయకులు రాంజీ గోండ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన వీరోచిత పోరాటాలను స్మరించుకున్నారు. తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య మాట్లాడుతూ, రాంజీ గోండ్ పోరాటం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. ఆయన త్యాగం అజరామరమైనదని పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు రాంజీ గోండ్ వీరగాథను, ఆదివాసీల సంస్కృతిని అందించేలా నిర్మల్లో వెంటనే రాంజీ గోండ్ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఆదివాసీలకు ఇచ్చిన హామీలను విస్మరించడం సరికాదని, వాటిని తక్షణమే అమలు చేయాలని హెచ్చరించారు.
ఆదివాసీల ఆస్తిత్వం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల స్ఫూర్తితో నేటికీ హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని భూమయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మంద మల్లేష్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సాకి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి తోడుసం గోవర్ధన్, మాజీ జిల్లా అధ్యక్షులు మొసలి చిన్నయ్య, మాజీ సర్పంచ్ సూరత్ సాయన్న, పిఎసిఎస్ డైరెక్టర్ బోసాని రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 1860లో వెయ్యి మంది అనుచరులతో కలిసి రాంజీ గోండ్ చేసిన పోరాటం చారిత్రాత్మకమని, ఆయన ప్రాణాలు వదిలిన 'వెయ్యి ఉరుల మర్రి' ప్రాంతాన్ని ప్రభుత్వం ఒక గొప్ప చారిత్రక సాక్ష్యంగా తీర్చిదిద్దాలని నాయకులు ఈ సందర్భంగా కోరారు.












