తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం రెండో విడత నిధుల విడుదలను ఈ నెల 20వ తేదీకి మార్చినట్లు సమాచారం. యాసంగి పంటల నేపథ్యంలో రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. రెండో విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ నిధులను ఈ నెల 20వ తేదీలోగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం అవసరమైన నిధులను సమీకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
యాసంగి సీజన్‌కు రైతు భరోసా నిధులను మూడు దఫాలుగా అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. మొదటి దఫాగా రూ.3,446.94 కోట్లను 68.89 లక్షల మంది రైతులకు విడుదల చేశారు. రెండో విడతలో ఐదెకరాల వరకు ఉన్న రైతులకు నిధులు జమ చేయవచ్చని, దీనికి రూ.3,000 నుంచి రూ.4,000 కోట్లు అవసరమవుతాయని అంచనా.
మూడో విడత నిధులను ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల వచ్చే నెల మొదటి వారంలో జమ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొత్తం పథకం అమలుకు ఒక సీజన్లో రూ.9,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయ వనరులతో పాటు, మార్కెట్ నుంచి రుణాలను సేకరించి ఈ పథకానికి నిధులు సమకూరుస్తోంది. ఈ నెలలో ఇప్పటికే రూ.3,900 కోట్లు, త్వరలో మరో రూ.3,000 కోట్లు రుణం తీసుకోనుంది. ఈ నిధుల నుంచి రైతు భరోసాకు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది.












