ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. ఈ దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్డీఓ కార్యాలయం నిర్మల్, సబ్ కలెక్టర్ కార్యాలయం బైంసాలో డివిజన్ వారీగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
అలాగే, గణనలో భాగంగా నిర్వహిస్తున్న సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








