ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించబోమని, భూ భారతి దరఖాస్తులను 60 రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో స్వీకరించే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
భూ భారతి కింద స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువు అయిన 60 రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి విభాగానికి సంబంధించిన రికార్డులను క్రమం తప్పకుండా పరిశీలించి, ఎప్పటికప్పుడు నవీకరించడంతో పాటు భద్రంగా నిర్వహించాలని సూచించారు.
కలెక్టరేట్ ఉద్యోగుల హాజరును నిరంతరం పర్యవేక్షించాలని, పొరుగు సేవల సిబ్బందికి ప్రతి నెలా సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధుల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని హెచ్చరించారు. ప్రతి విభాగ పరిధిలోని ఉద్యోగుల వివరాలు, పెండింగ్ అంశాలపై పూర్తి సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు.











