కుంటాల మండల కేంద్రంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ఘనంగా జరిగాయి. ఐదుగురు లబ్ధిదారులు తమ నూతన ఇళ్లలో సంప్రదాయబద్ధంగా గృహప్రవేశాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
మండల కేంద్రానికి చెందిన మట్ట శోభ, పందెన అశ్విత, షికారి భోజవ్వ, మూసరి లక్ష్మి, ఎంపెల్లి లక్ష్మి తమ నూతన ఇందిరమ్మ గృహాల్లో గృహప్రవేశాలు చేసుకున్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ సర్పంచ్ జక్కుల గజేందర్ అధ్యక్షతన, పంచాయతీ కార్యదర్శి రాజాబాపు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు నూతన గృహాలను పరిశీలించి, లబ్ధిదారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేస్తోందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అల్లాడి వనజ, తహసీల్దార్ ఆడే కమల్‌సింగ్, ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జుట్టు అశోక్, పీఏసీఎస్ చైర్మన్ జుట్టు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ జుట్టు మహేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిరుపేద కుటుంబాలకు శాశ్వత నివాసం లభించడం ప్రభుత్వ సంక్షేమ లక్ష్యానికి నిదర్శనమని వారు తెలిపారు.
ఇంజనీర్ శైలజ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యుడు మట్ట గజ్జారం, మరియు పలువురు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.












