ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఈనెల 4వ తేదీన జరగనున్న నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పటిష్టంగా పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.
బుధవారం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నిక ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. కౌన్సిలర్లకు పార్టీల వారీగా సీటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు, త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌ను మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో సీపీవో జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, పలువురు అధికారులు పాల్గొన్నారు.











