ప్రపంచ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని, వారి నైపుణ్యాల పెంపుదల ద్వారా ఉన్నత అవకాశాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.
నిర్మల్ కలెక్టరేట్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులు తమ వృత్తులకు సంబంధించిన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు.
కార్మిక చట్టాలు, ప్రభుత్వ పథకాలపై కార్మికులకు అవగాహన ఉండాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నైపుణ్యం కలిగిన కార్మికులకు అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడానికి తగిన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన ప్రోత్సహించారు.
ప్రభుత్వాలు అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను ఉపయోగించుకుని కార్మికులు తమ నైపుణ్యాలను మరింత వృద్ధి చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ కార్యకలాపాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడంతో పాటు, పలువురు కార్మికులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ముత్యం రెడ్డి, పలువురు అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.












