ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఈ మేరకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని, నిర్మాణ ప్రక్రియలో అధునాతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా, ఏ ఫైలు కూడా వారం రోజుల కంటే ఎక్కువ సమయం అధికారుల వద్ద ఉండకూడదని స్పష్టం చేశారు.
సిబ్బంది కొరతను అధిగమించడానికి డిప్యుటేషన్‌పై అధికారులను తెచ్చుకొని పనులను వేగవంతం చేయాలని, ప్రతి దశలోనూ పనులను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇళ్లు కట్టుకోలేని నిరుపేద లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాలు లేదా బ్యాంకుల ద్వారా రుణం అందేలా చర్యలు తీసుకోవాలని, హౌసింగ్ కార్పొరేషన్ నిధులతో రుణం తీర్చేలా చూడాలని సూచించారు.
ఈ సమీక్షలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, నలుగురు జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఇళ్ల మంజూరు, పురోగతి, ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు.












