గ్రామాల సమస్యల పరిష్కారమే గ్రామ సభల నిర్వహణ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉన్నతికి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు తదితర పథకాల ద్వారా ఎందరో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో దాదాపు 60 వేల రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
గ్రామ సభల ద్వారా గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కలెక్టర్ వివరించారు. ప్రతి రెండు నెలలకోసారి తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించి, గ్రామాల్లోని సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయని, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా మార్చామని తెలిపారు. అతి త్వరలోనే వైద్య కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
అధికారులంతా జవాబుదారీతనంతో పని చేస్తూ, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ సభలో భాగంగా, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన గ్రామస్తుల వివరాలు చదివి వినిపించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అన్ని పథకాలను సద్వినియోగపరుచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.








