కుంటాల మండల కేంద్రంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతో శోభాయాత్రను నిర్వహించారు. "జై శ్రీరాం, జై హనుమాన్" నినాదాలతో పరిసరాలు మారుమోగాయి.
హనుమంతుని చిత్రపటాన్ని అలంకరించి, ప్రత్యేకంగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. డీజే భక్తి గీతాలు, మహిళల మంగళహారతులు, హనుమాన్ దీక్ష స్వాముల బొర్లుడు దండాలతో శోభాయాత్ర భక్తిమయంగా సాగింది.
ముత్యాల తాళాలు, భజనలు, నృత్యాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రను భుజంగం గణపతి గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామస్థులు ఇళ్ల వద్దకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, యువకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాంతి భద్రతల కోసం పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ శోభాయాత్రతో కుంటాల ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.












