రానున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో, పుష్కరాల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. బాసర సరస్వతి ఆలయంతో పాటు గోదావరి నదిలో పుణ్యస్నానాల కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
భక్తుల రాకపోకలకు అనుగుణంగా పార్కింగ్ సదుపాయాలు కల్పించడం, పుణ్యస్నానాల సమయంలో ఆటంకాలు లేకుండా చూడటం వంటి అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. వసతి, తాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్ వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చాలని, పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, పుష్కరాల సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని, భక్తులకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీలు రాజేష్ మీనా, సాయికిరణ్, డిపివో శ్రీనివాస్, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ సందీప్, బాసర ఆలయ ఈవో విజయ రామారావు తదితర అధికారులు పాల్గొన్నారు.


