తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికులకు శుభవార్త. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల సమాఖ్యల నుంచి అద్దె ప్రతిపాదికన మరిన్ని బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రయాణికులు ఎలాంటి రద్దీ లేకుండా, టెన్షన్ ఫ్రీ జర్నీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 152 బస్సులు సేవలు అందిస్తుండగా, తాజాగా 200 బస్సులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం కింద TSRTCకి మరిన్ని బస్సులు సమకూరనున్నాయి. ఈ పథకం ద్వారా మహిళా సంఘాల సమాఖ్యలు ఆర్టీసీకి అద్దె ప్రతిపాదికన బస్సులను అందిస్తున్నాయి. ప్రస్తుతం 152 బస్సులు నడుస్తుండగా, తాజాగా 200 బస్సులు బాడీ బిల్డింగ్ పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 248 బస్సులు మార్చి నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే, ఈ 200 బస్సులను వీలైనంత త్వరగా రోడ్డెక్కించాలని ఆర్టీసీ యోచిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అదనపు బస్సుల అవసరం ఏర్పడింది. మహిళా సంఘాల ద్వారా బస్సులు సమకూరడంతో ఆర్టీసీపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు.
ఇందిరా మహిళా శక్తి పథకం కింద మొత్తం 600 బస్సులు ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలివిడతలో 152 బస్సులు మంజూరు చేయగా, మిగిలిన 448 బస్సులు కూడా ఇవ్వాలని సెర్ప్ (SERP) నిర్ణయించింది. తాజాగా అందుబాటులోకి వస్తున్న 200 బస్సులతో పాటు, మిగిలిన బస్సులు కూడా త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. గతంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులను అద్దెకు తీసుకొని ఆర్టీసీ నిర్వహించేది. ఇప్పుడు మహిళా సంఘాల భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రతి బస్సుకు ఆర్టీసీ నెలకు రూ.69,468 చొప్పున అద్దె చెల్లిస్తోంది. ఈ బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీనే సమకూరుస్తోంది. గత ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను ఎంపిక చేశారు. మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకున్న నేపథ్యంలో ఈ బస్సులను ఆయా సంఘాలకు ఆర్టీసీ హైపోథికేషన్ చేసింది.


