గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హుల జాబితా నుంచి లబ్ధిదారుల పేర్లను ప్రస్తుత ప్రభుత్వం తొలగించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు మిర్యాలగూడ ఇంచార్జ్ సబ్ కలెక్టర్, తాసిల్దార్ లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ చర్యను వారు రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు.
మిర్యాలగూడ మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్, సీనియర్ కౌన్సిలర్ పెద్ది శ్రీనివాస గౌడ్ ల నేతృత్వంలో పార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు గురువారం ఈ మేరకు వినతి పత్రాలను అందజేశారు. లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఎంపికైన లబ్ధిదారుల పేర్లను తొలగించడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
తొలగించిన అర్హుల జాబితాను వెంటనే పునరుద్ధరించాలని, రాజకీయ ప్రేరిత నిర్ణయాలపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అర్హులైన వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సందేషి అంజన్ రాజు, దీపిక విజయ్, గుడిసె జానకమ్మ దుర్గాప్రసాద్, లావుడి అరుణ సుధాకర్, మర్రి అంజి బాబు, తిరుమలగిరి వజ్రం, వడ్డేపల్లి శ్రీనివాస్, జన్నపాల సునీత కిరణ్, యర్రమల్ల దినేష్, పద్మశెట్టి లక్ష్మి కోటేశ్వర రావు, తిరంశెట్టి సీతా కోటేశ్వర రావు, గంగుల బిక్షం యాదవ్, భూక్య రాంబాబు, ఎక్కా స్వరూప మనిదీప్, ప్రేమ్ కుమార్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు.












