ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఆత్మహత్యల ద్వారా కాదని, శాంతియుత నిరసనల ద్వారానే సాధ్యమవుతుందని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడారు.
హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉంటుందని దశరథ్ నాయక్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయడం, విధులు బహిష్కరించి నిరసన తెలపడం తప్పు కాదని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలో భాగంగా కొందరు ఆవేశంతో ఆత్మహత్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని, దీనివల్ల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతాయని ఆయన అన్నారు.
డిమాండ్లు, హక్కుల సాధన కోసం ఉద్యోగులు, కార్మికులు శాంతియుత మార్గంలో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని బంజారా ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల డిమాండ్లకు తమ సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటించింది.
ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి చర్చలకు పిలిచి, సత్వర పరిష్కారం చూపాలని దశరథ్ నాయక్ కోరారు. భవిష్యత్తులో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.








