నిర్మల్, ఆగస్టు 4, 2026
కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆగస్టు 10న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమానికి సీఐటీయూ సంఘీభావం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ పిలుపునిచ్చారు.
నిర్మల్: అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10న నిర్వహించ తలపెట్టిన 'జైల్ భరో' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ పిలుపునిచ్చారు.
ఈ మేరకు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో అంగన్వాడీ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం మంగళవారం నిర్వహించబడింది. ఈ సమావేశానికి అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి. లలిత అధ్యక్షత వహించి మాట్లాడారు.
నూతన విద్యా విధానం (NEP), పీఎం-శ్రీ (PM SHRI) వంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని, ఐసీడీఎస్ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తోందని సునీత విమర్శించారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లుగా ఉన్న అంగన్వాడీ టీచర్లను, ఆయాలను కార్మికులుగా గుర్తించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనలో భాగంగా ఆగస్టు 10న నిర్వహించే 'జైల్ భరో' కార్యక్రమంలో ప్రతి అంగన్వాడీ టీచర్, ఆయా తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి శైలజ, నాయకులు సాదా, నర్సమ్మ, శేకుంతల, భూలక్ష్మి, దీప తదితరులు పాల్గొన్నారు.












