రాష్ట్రంలో అక్రిడిటేషన్ల జారీలో దళిత, గిరిజన జర్నలిస్టులపై వివక్ష చూపుతూ, కుల వివక్షతో కూడిన అన్యాయం జరుగుతోందని తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి ఆరోపించారు. ఈ నెల 29న హైదరాబాద్ లోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించే 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెంకటస్వామి మాట్లాడారు. అక్రిడిటేషన్ కార్డుల పంపిణీలో తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అక్రిడిటేషన్ కమిటీలలో ఇతర సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగుతోందని, దళిత, గిరిజన జర్నలిస్టులను పక్కన పెట్టే విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ లోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించే 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు, వివిధ మండలాల నుండి దళిత, గిరిజన జర్నలిస్టులు, సామాజిక వాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.












