వనపర్తి, 2026-06-05
వనపర్తి నియోజకవర్గంలో రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతోందని, దీనివల్ల ప్రజల అభివృద్ధి కుంటుపడుతోందని అఖిలపక్ష ఐక్యవేదిక ఆరోపించింది. నాయకులు విమర్శలు, ఆరోపణలతో కాలం గడపకుండా ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించింది.
గత కొన్ని రోజులుగా వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయతీ గల్లీ నుండి ఢిల్లీ వరకు వెళ్లింది. ఈ పంచాయతీ వల్ల ప్రజలకు ఏదైనా అభివృద్ధి జరుగుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాయకులు విమర్శలతోనే కాలం గడుపుతూ, అభివృద్ధిని మరచి ఆగమైపోతున్నారని, వారి ఆధిపత్య పోరాటాల వల్ల ప్రజలు ఏమి చర్చిస్తున్నారో తెలుసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక సూటిగా ప్రశ్నించింది.
టెండర్లు, కమిషన్లపై స్పష్టత ఇవ్వాలి
చిన్నారెడ్డి గారి విమర్శలు కేవలం టెండర్ల వ్యవహారానికే పరిమితమయ్యాయా వీటి వెనుక కమిషన్ల వ్యవహారాలున్నాయా అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. దీనిపై ఆయన విలేకరుల సమావేశంలోనే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
ఆధిపత్య పోరుపై నిలదీత
మూడు సంవత్సరాల క్రితం మీ పంచాయతీ సద్దుమణిగిన తర్వాత, ప్రభుత్వంలో పదవులున్న ముగ్గురు నాయకులు ఏకమై మేమంతా ఒకటే అని చాటి చెప్పారు కదా మరి ఇప్పుడు ఆధిపత్య పోరు ఎందుకు వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు జవాబు చెప్పాల్సిన విషయాలను పక్కన పెట్టి, బలనిరూపణ కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా అని అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజల తరపున ప్రశ్నిస్తోంది.
ప్రశ్నించే గొంతులపై దాడి సరికాదు
అలాగే, మీ పక్కన ఉన్న కొందరు నాయకులు అక్రమాలకు పాల్పడుతుంటే, వాటిని ప్రశ్నించే గొంతులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం వారిని కట్టడి చేయకపోతే ఎదురయ్యే పరిణామాలు మీకే చుట్టుకుంటాయి, జాగ్రత్త.
ప్రెస్ మీట్ ఏర్పాటుకు కారణం
ఈరోజు పలు మండలాలు తిరుగుతూ కమిటీలను వేస్తున్న సమయంలో ప్రజల మధ్య జరిగిన చర్చ విని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ తెలిపారు.
అభివృద్ధి వైపు దృష్టి సారించాలి
నాయకులారా, ఇంకా రెండు సంవత్సరాలకు పైగా ఎన్నికలు లేవు. దయచేసి ఆధిపత్య పోరాటాలను పక్కనపెట్టి, ప్రజల అభివృద్ధి వైపు మీ అధికారాన్ని ఉపయోగించాలని కోరుతున్నాము. లేదంటే ప్రజలంతా ఏకమై మరో నాయకుడిని ఎన్నుకుంటారని హెచ్చరిస్తున్నాము.












