రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, ప్రస్తుత పాలన, ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటు హక్కు భద్రత లేని ప్రజాస్వామ్యం ఆటవిక రాజ్యంతో సమానమని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజలు నేతలను ఎన్నుకోవడం లేదని, కొనుగోలు చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. భవిష్యత్తులో ఇదే తరహా ఎన్నికలు నిర్వహిస్తే, ఎన్నికల నిర్వహణకు అర్థం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం సమాధి అవుతుందని, అప్రజాస్వామ్యమే పాలిస్తుందని అన్నారు.
అపార సంపద కలిగిన భారతదేశంలో పేదలు అధిక సంఖ్యలో ఉండటానికి కారణాలను పాలకులు తెలుసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుల సంఘాలు శాపంగా మారాయని, ఇతర రాష్ట్రాల్లో మతోన్మాదం శాపంగా మారిందని పేర్కొన్నారు. ఒకప్పటి ఉద్యమ త్యాగాలు, నేతల స్ఫూర్తి నేడు కనుమరుగు అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మేధావులు మౌనంగా ఉండటంపై ప్రశ్నించిన శ్రీనివాస్, భయపడుతున్న ప్రజలకు భరోసా ఇచ్చే నాయకుడు అవసరమని అన్నారు. స్వేచ్ఛగా వ్యవహరించలేని మీడియా పరిస్థితిని ప్రస్తావిస్తూ, మీడియా తన పాత్రను నిరూపించుకునే బంగారు రోజులు రావాలని ఆకాంక్షించారు. రోజులు, నెలలు మారుతున్నా ప్రజల జీవితాలు మారడం లేదని, ఏడాదికొకసారి ఎన్నికలు జరిగితే బాగుండుననే ఆశను ప్రజలలో రేకెత్తించి, వారిని బానిసత్వానికి అలవాటు పడేలా చేస్తున్నారని విమర్శించారు.
చట్ట భద్రత, పౌర సేవలు, పౌష్టిక ఆహారం, కనీస వసతులు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రక్షణ వంటివి లోపిస్తున్నాయని, విద్య, వైద్యం ఖరీదైన దోపిడీ వ్యవస్థలుగా మారాయని శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుత పాలన ప్రజాస్వామ్యం కాదని, రాజ్యాంగం సాక్షిగా చట్టపరమైన హక్కులు కూడా లభించడం లేదని, న్యాయం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మెజారిటీ ప్రజలు ప్రస్తుత పాలక నేతలకు ఎందుకు మద్దతు పలుకుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు.
గతంలో రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉండేవని, కానీ నేడు పుట్టుకొస్తున్న పార్టీలు పాలక పార్టీలకు బానిసలుగా మారి, ప్రజలను, సమాజాన్ని మోసం చేస్తున్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గత 28 ఏళ్లుగా సిద్ధాంతం కోసం, సంపద అందరికీ చేరాలని, సమ సమాన పాలన, రాజ్యాంగ బద్ధమైన స్వేచ్ఛ, కులం-మతం రహిత సమాజం కోసం పోరాడుతుందని తెలిపారు. ప్రజలు తమకు వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహించాలని కోరారు. ఓటు వేస్తే సంపద, స్వేచ్ఛ, ఆత్మగౌరవం అందరికీ సొంతం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరాలనుకునే ఆసక్తిగలవారు తమ బయోడేటాను పంపాలని సూచించారు.












