ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కొందరు వ్యక్తులు జనసేన పార్టీ పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నించడం, అరెస్ట్ చేయించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించడాన్ని మిర్యాలగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ భార్గవ్ తిరునగరు తీవ్రంగా ఖండించారు. ఇది భావప్రకటన స్వేచ్ఛకు, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి వేటు లాంటిదని ఆయన అభివర్ణించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం శాఖలో పనిచేసి, ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రజాప్రతినిధిగా చక్కటి పాత్ర పోషించారని, ఆయన శాస్త్రీయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషణలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఉంటాయని భార్గవ్ తెలిపారు. నిష్పాక్షిక విశ్లేషణతో పాటు, ఆయనకు సోషల్ మీడియాలో విశేష ప్రజాదరణ ఉందని, లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన సమీక్షపై జనసేన పార్టీ వర్గీయులుగా చెప్పుకుంటున్న కొందరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం అక్రమం, అప్రజాస్వామికం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు జర్నలిజం విలువలను దెబ్బతీస్తాయని అన్నారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ పై తప్పుడు ఫిర్యాదులకు పాల్పడటాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని, ఇది భావ వ్యక్తీకరణపై దాడిగా భావిస్తున్నామని భార్గవ్ స్పష్టం చేశారు. ఈ చర్యను అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేశారు.











