హైదరాబాద్, 2026-08-21
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సుస్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయవద్దని, అది పూర్తిగా ఆమె సొంత అభిప్రాయమని క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు బాలు నాయక్, నాయిని రాజేందర్ రెడ్డి స్పందిస్తూ కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో సురేఖకు సంబంధం లేకపోతే వాటిని ఖండించాలని వారు అన్నారు.
సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ స్పందించాలి: బీర్ల ఐలయ్య
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మామూలేనని, సొంత పార్టీ వాళ్లు విమర్శలు చేస్తే ఎలాగని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తిన జెండాను దించకుండా పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ అని, ఆయనపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించాలని డిమాండ్ చేశారు. కష్టపడుతున్న సీఎంపై బండలేస్తారా అని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే సీఎంపై విమర్శలు చేయడం బాధాకరమని ఐలయ్య అన్నారు.












