ఖానాపూర్ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన ప్రముఖ గిరిజన నాయకుడు అజ్మీర గోవింద్ నాయక్ అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి నియోజకవర్గ ప్రజలకు, కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మిగిలింది.
నిర్మల్ జిల్లాకు చెందిన అజ్మీర గోవింద్ నాయక్, గిరిజన, గిరిజనేతర ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
నియోజకవర్గ పునర్విభజనకు ముందు ఏజెన్సీ ప్రాంతంలోని పలు మండలాల అభివృద్ధికి ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రజలకు సహాయం చేయడమే తన ధ్యేయంగా పెట్టుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని ఆయన సన్నిహితులు తెలిపారు.
అన్ని వర్గాల ప్రజల సమస్యలను 'తన-మన' భేదం లేకుండా పరిష్కరించడానికి కృషి చేసిన గొప్ప నాయకుడిగా ఆయనను అభివర్ణిస్తున్నారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు.
ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ, అజ్మీర గోవింద్ నాయక్ గారి మృతి గిరిజన సమాజానికి, ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.








