భైంసా, 2026-06-05
తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్లను పరిమితం చేయడాన్ని జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల హామీలను విస్మరించి అర్హులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్లను పరిమితం చేయడాన్ని జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ప్రస్తుతం కొంతమందికి మాత్రమే మంజూరు చేసి మిగతా అర్హులను విస్మరించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
పెన్షన్ల కోసం ఎదురుచూపు
ముఖ్యంగా వృద్ధులు, బీడీ కార్మికులు కొన్నేళ్లుగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. పెన్షన్ మంజూరు కాలేదని తెలిసి కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారి కుటుంబాల్లో తీవ్ర నిరాశ నెలకొందని, పెన్షన్‌పై ఆధారపడి జీవించే వారి రోజువారీ జీవనం మరింత దుర్భరంగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
డిమాండ్ చేసిన జనసేన
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అర్హులైన ప్రతి ఒక్కరికీ వెంటనే చేయూత పెన్షన్ మంజూరు చేయాలని సుంకేట మహేష్ బాబు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వృద్ధులు, బీడీ కార్మికుల పక్షాన జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.












