మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయానికి నిదర్శనంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. ఈ సందర్భంగా బైంసాలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.
బైంసాలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ సంబరాల్లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ, మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 'రాక్షస పాలన' అంతమైందని, రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలోనూ బీజేపీ తన ప్రభావాన్ని చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీని అన్ని వర్గాల ప్రజలు ఆదరించడం వల్లే ఈ అఖండ మెజారిటీ సాధ్యమైందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తమకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి తాడేవార్ సాయినాథ్, పట్టణ మండల అధ్యక్షులు రావుల రాము, సిరం సుష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎనుపోతుల మల్లేష్, నాయకులు కొండా సాయి గౌడ్, కౌన్సిలర్ సుభాష్, సర్పంచులు సిరం రాజమణి శ్రీనివాస్, సుధాకర్, సత్యనారాయణ, మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.











