సోన్, లక్ష్మణచందా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 11
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సోన్, లక్ష్మణచందా మండలాల్లో పర్యటించి, ఓటరు నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్.ఐ.ఆర్ - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సోన్, లక్ష్మణచందా మండలాల్లో పర్యటించి, జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ఫారమ్‌లను సేకరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్లు ఫారమ్‌లు నింపే సమయంలో అధికారుల సహకారం అందించాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
బి.ఎల్.ఓ.లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, వాటిని వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. రోజువారీగా నిర్దేశించుకున్న లక్ష్యాలను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం లక్ష్మణచందా మండలం పార్పల్లి గ్రామంలో ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య, పంపిణీ చేసిన ఫారమ్‌లు, ఇప్పటి వరకు స్వీకరించిన దరఖాస్తులు, పూర్తి చేసిన డిజిటలైజేషన్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్.ఐ.ఆర్. ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా సూపర్ వైజర్లు నిరంతరం పర్యవేక్షించాలని, తప్పులు లేని జాబితా రూపకల్పనకు కృషి చేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ఈ పర్యటనలో తహసిల్దార్లు సంతోష్, సరిత, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










