పెద్దారవీడు (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 01
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను ప్రభుత్వం జలసమాధి చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నిర్వాసితులు ఇంకా గ్రామాల్లోనే ఉండగానే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గల్లంతయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను ప్రభుత్వం జలసమాధి చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నిర్వాసితులు ఇంకా గ్రామాల్లోనే ఉండగానే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో విషాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గల్లంతయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. సోమవారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో కొందరికి ఇంకా నష్టపరిహారం అందలేదు. వారిలో కొందరు పరిహారం కోసం నిర్వాసిత గ్రామాల్లోనే ఎదురుచూస్తున్నారు. నిర్వాసితులందరూ గ్రామాలను ఖాళీ చేశారా లేదా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించకుండానే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేశారు.
ఆ సమయంలో లక్ష్మయ్య కుటుంబం కలనూతల నిర్వాసిత గ్రామలోనే ఉంది. ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలినట్లు తెలుసుకుని, నిరాశతో లక్ష్మయ్య కుటుంబం తమ సామాన్లతో బొలేరో వాహనంలో సురక్షిత ప్రాంతానికి బయలుదేరింది. దురదృష్టవశాత్తు, వరద నీటి ఉధృతికి వారి వాహనం కొట్టుకుపోయింది. దీంతో, కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతి చెందగా, ముగ్గురు కొట్టుకుపోయి గల్లంతైనట్లు సమాచారం. ఈ ఘటనపై అర్ధరాత్రి 12 గంటల వరకు అధికారులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మార్కాపురం డిఎస్పి డాక్టర్ యు.నాగరాజు, పెద్దారవీడు ఎస్ఐ ఎం.సైదుబాబు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.
నీళ్లు వదిలి నిండు ప్రాణాలను బలి తీసుకోవడం అత్యంత శోచనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టన్నెల్స్ నుండి వెంటనే నీటి విడుదలను ఆపివేయాలని, కొట్టుకుపోయిన వారిని రక్షించాలని, నిర్వాసిత గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించిన తర్వాతే వెలిగొండకు నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన సంతాపం ప్రకటించారు.
అనేక కుటుంబాలు తమ పేర్లు గెజిట్ ప్రకటిస్తారని ఎదురుచూస్తూ, ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో గ్రామాల్లోనే ఉన్నాయని, రిజర్వాయర్ కోసం వదిలిన నీటిలో చిక్కుకుపోయే పరిస్థితి తలెత్తిందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 31 లోపే జాబితాలు ప్రకటిస్తామని, రోజువారీ నిధులు విడుదల చేస్తామని పదేపదే చెప్పిన మాటలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, ప్రభుత్వం ముందుగానే వాగ్దానం మేరకు అర్హుల జాబితా ప్రకటించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘోర ఘటనపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి తీసుకెళ్లారు. దీంతో, మంత్రి వెంటనే స్పందించి నీటి విడుదల నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.











