మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా వేలాల గ్రామంలో జరగనున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర కోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను అధికారులు బుధవారం పరిశీలించారు.
ఫిబ్రవరి 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
జాతర ప్రదేశంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, గోదావరి ఘాట్ వద్ద స్నానవాటికలో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు, పారిశుధ్య కార్మికులకు విధులు కేటాయించారు.
భక్తుల భద్రత దృష్ట్యా, లా అండ్ ఆర్డర్ సమస్యలను అధిగమించడానికి పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అలాగే, వైద్య సేవలు అందించడానికి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సమీక్షా కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ జీ సత్యనారాయణ, సీఐ నవీన్ కుమార్, ఎంపీఓ శ్రీపతి బాపు రావు, ఎస్సై రాజశేఖర్, వైద్యాధికారి డా.శ్రావ్య, పంచాయతీ కార్యదర్శులు, వైద్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

