మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ముఖ్య శివాలయాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రధాన శివాలయాలైన కదిలే పాపహరేశ్వర స్వామి దేవాలయం, బాబాపూర్ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, బూరుగుపల్లి రాజరాజేశ్వర స్వామి దేవాలయం, దస్తురాబాద్ మండలంలోని శివాలయం, నిర్మల్ పట్టణంలోని వెంకటాద్రిపేట, శివకోటి మందిరం, నగరేశ్వర వాడ వంటి ప్రాంతాలలో భక్తుల రాకపోకలు అధికంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. రద్దీని అదుపు చేయడానికి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, దేవాలయ పరిసరాల్లో నిరంతర పోలీస్ నిఘా ఉండేలా చూడాలని సూచించారు.
అలాగే, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, భక్తుల భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ స్పష్టం చేశారు. ఈ ఏర్పాట్లు భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడానికి సహాయపడతాయి.

