భద్రాద్రి కొత్తగూడెం, 2026-08-31
హైదరాబాద్లోని తుక్కుగూడలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష కుటుంబానికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అండగా ఉంటామని భరోసా కల్పించారు. శిరీష చిత్రపటానికి ఆయన ఘనంగా నివాళులర్పించారు.
అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం, చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష హైదరాబాద్లోని తుక్కుగూడలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలుసుకున్న భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, చౌటిగూడెం గ్రామానికి చేరుకుని శిరీష చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారు ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఎమ్మెల్యే విచారం
శిరీష మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.












