భైంసా, జూలై 7
పట్టణంలోని గోపాల్రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పరిచయ, ఆహ్వాన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య అధ్యక్షత వహించారు.
పట్టణంలోని గోపాల్రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పరిచయ, ఆహ్వాన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వంలో క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ పాఠ్యాంశాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
కళాశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, గ్రంథాలయం, ఆంగ్ల భాషా అభ్యాస కేంద్రం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం తదితర సదుపాయాలను వినియోగించుకొని పోటీ పరీక్షలకు సిద్ధమై ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ముఖ్య అతిథిగా హాజరైన రాథోడ్ విజేష్కుమార్ మాట్లాడుతూ కళాశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, అధ్యాపకుల అంకితభావాన్ని అభినందించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ముఖ్య అతిథిని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు.
ఉప ప్రిన్సిపాల్ డాక్టర్ రఘునాథ్, అంతర్గత నాణ్యతాభివృద్ధి విభాగం సమన్వయకర్త డాక్టర్ రవికుమార్ కళాశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై చిత్రాల సహాయంతో వివరించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.
అనంతరం సీనియర్, నూతన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












